ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తప్పా: రాఘవ్‌ చద్దా

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాజ్యసభలో పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుంచి తనను తొలగించడంపై ఎంపీ రాఘవ్ చద్దా...

By -  అంజి
Published on : 3 April 2026 12:00 PM IST

Raghav Chadha vs AAP, Arvind Kejriwal Raghav Chadha Feud, AAP Rajya Sabha Deputy Leader Removal, Raghav Chadha Video Message X, Ashok Mittal AAP MP, Internal Conflicts in Aam Aadmi Party, Raghav Chadha Discharged Excise Case Silence, Indian Politics News 2026

ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తప్పా: రాఘవ్‌ చద్దా

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాజ్యసభలో పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుంచి తనను తొలగించడంపై ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని నాయకత్వం తనను పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకుంటోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

పార్లమెంటులో ప్రజల సమస్యలను లేవనెత్తడం నేరమా అని రాఘవ్ చడ్డా ప్రశ్నించారు. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక ధరలు, గిగ్ వర్కర్ల కష్టాలు, ఆహార కల్తీ, టోల్ ప్లాజాల దోపిడీ వంటి సామాన్యుడికి సంబంధించిన అంశాలపై తాను గళమెత్తానని.. ఇది పార్టీకి ఎందుకు ఇబ్బందిగా మారిందని ఆయన నిలదీశారు. తనను పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించాలని ఆప్ నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. "నన్ను నిశ్శబ్దం చేయగలరు కానీ, ఓడించలేరు" అంటూ ఆయన పార్టీ పెద్దలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, పంజాబ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చడ్డా.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌తో సహా ఇతర నేతలు అరెస్టయిన సమయంలో ఆయన విదేశాల్లో ఉండటం, ఇటీవల వారు కోర్టు నుంచి విముక్తి పొందినా ఆయన స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. స్వాతి మలివాల్ తర్వాత పార్టీ నాయకత్వంతో విభేదించిన రెండో రాజ్యసభ ఎంపీగా రాఘవ్ చడ్డా నిలిచారు. అయితే, ఆయన ఆరోపణలను ఆప్ నేతలు తోసిపుచ్చారు. పార్టీలో అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఆయనకు సమయం ఇస్తామని అశోక్ మిట్టల్ పేర్కొన్నారు.

Next Story