పాల ట్యాంకర్ బీభత్సం, ముగ్గురు మృతి.. 150 మందికి గాయాలు

సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పాల ట్యాంకర్‌ ఉన్నట్లుండి జనాలపైకి దూసుకెళ్లింది.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 6:23 AM GMT
sikkim, road accident, milk van, three dead, 150 injured,

పాల ట్యాంకర్ బీభత్సం, ముగ్గురు మృతి.. 150 మందికి గాయాలు

సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పాల ట్యాంకర్‌ ఉన్నట్లుండి జనాలపైకి దూసుకెళ్లింది. మూడు కార్లను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా రద్దీగా ఉన్న ప్రాంతంలో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో 30 మందికి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ రోడ్డుప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రోడ్డు ప్రమాదం రాణిపోల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సిక్కింలోని మీడియా చెబుతున్న వివరాల ప్రకారం.. తాంబ్లా గేమ్‌ ఫెయిర్‌లో ఆదివారం రాత్రి 7.13 గంటలకు ఈ రోడ్డుప్రమాదం సంభవించింది. ఆ సమయంలో రాణిపూర్‌ టాటా మైదానం జనంతో కిటకిటలాడింది. ఈ సమయంలోనే హఠాత్తుగా సిక్కిం మిల్క్‌ యూనియన్‌ ట్యాంకర్‌ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా ముందుకు దూసుకొచ్చింది. జనం రద్దీగా ఉన్నారు. వారిపైకి దూసుకెళ్లింది. దాంతో.. పాల ట్యాంకర్‌ కింద పడిపోయిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో జనాల హాహాకారాలు మిన్నంటాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 150 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


Next Story