'సిద్ధరామయ్య కన్నుమూశారు': మెటా అనువాద లోపంపై సీఎం తీవ్ర విమర్శలు

కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు , మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది.

By అంజి
Published on : 18 July 2025 9:01 AM IST

Siddaramaiah, Meta, translation error, Karnataka Chief Minister

'సిద్ధరామయ్య కన్నుమూశారు': మెటా అనువాద లోపంపై సీఎం తీవ్ర విమర్శలు

కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు , మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది. ప్రముఖ నటి బి సరోజా దేవి మృతికి సంతాపం తెలుపుతూ కన్నడలో రాసిన ఈ పోస్ట్‌ను ఆంగ్లంలోకి తప్పుగా అనువదించడంతో సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మెటాకు అధికారిక లేఖ కూడా పంపారు.

"ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న కన్నుమూశారు, బహుభాషా నటి, సీనియర్ నటి బి. సరోజాదేవి పార్థివ దేహాన్ని దర్శించుకుని చివరి నివాళులర్పించారు" అని పోస్ట్ యొక్క తప్పు అనువాదంలో ఉంది. ఈ తప్పుడు ట్రాన్స్‌లేషన్‌పై తీవ్రంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మెటా తన కన్నడ ఆటో-అనువాద ఫీచర్‌ను ఖచ్చితమైనదిగా నిర్ధారించే వరకు నిలిపివేయాలని కోరారు.

"మెటా ప్లాట్‌ఫామ్‌లలో కన్నడ కంటెంట్‌ను తప్పుగా ఆటో-అనువాదం చేయడం వల్ల వాస్తవాలు వక్రీకరించబడుతున్నాయి. వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి. అధికారిక సమాచార మార్పిడి విషయానికి వస్తే ఇది చాలా ప్రమాదకరం. నా మీడియా సలహాదారు కెవి ప్రభాకర్ వెంటనే సరిదిద్దాలని కోరుతూ మెటాకు అధికారికంగా లేఖ రాశారు" అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.

"సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చూపబడిన అనువాదాలు తరచుగా తప్పుగా ఉంటాయని పౌరులు తెలుసుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. టెక్ దిగ్గజాల ఇటువంటి నిర్లక్ష్యం ప్రజల అవగాహన. నమ్మకాన్ని దెబ్బతీస్తుంది" అని ఆయన అన్నారు.

Next Story