మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజకీయ ప్రముఖులకు చల్లారిన ఛాయ్ ఇచ్చినందుకు ఓ ప్రభుత్వాధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రోటోకాల్ ఉల్లంఘన పేరిట నోటీసులు జారీ చేశారు. గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ అధికారిని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఛతర్‌పూర్ జిల్లా ఖజురహో పర్యటనలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నాణ్యత లేని చల్లని టీ అందించాడని ఆరోపణలు రావడంతో జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కనౌహాపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాజ్‌నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) డీపీ ద్వివేది షోకాజ్ నోటీసు అందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ రేవాకు వెళ్తుండగా సోమవారం ఖజురహో విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఆ సమయంలో విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వారికి అధికారులు టీ అందించారు. అయితే ఆ టీ చల్లారిపోయి ఉండటంతో వాళ్లంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాణ్యత లేని చల్లారిన టీ అందించినందుకు 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్‌డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.