శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఇప్పటికే రెండుసార్లు పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈడీ నోటీసులు అందుకున్నా.. సంజయ్ విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ ఆఫీసుకు రావాలని కోరగా, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరుకాలేనని చెప్పారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఆయన ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ ట్విటర్ వేదికగా స్పందించారు.
''రాజకీయ కుట్రలో భాగంగానే తన ఇళ్లపై దాడులకు దిగుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొంచబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా'' అని ట్వీట్ చేశారు.
ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్ ఇంటికి చేరుకుంది. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సంజయ్ మద్దతుదారులు ఆయన నివాసం బయట గుమిగూడారు. ఈడీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈడీ ఏప్రిల్‌లో సంజయ్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.