మోడల్ ఆత్మహత్య కేసు.. శివసేన నేత సంజయ్ రాథోడ్ రాజీనామా
Shiv Sena minister Sanjay Rathod resigns. మోడల్, టిక్ టాక్ స్టార్ పూజ చవాన్ (22) ఆత్మహత్య వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు
By Medi Samrat
మోడల్, టిక్ టాక్ స్టార్ పూజ చవాన్ (22) ఆత్మహత్య వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. పుణెలోని వనవాడి ప్రాంతంలో ఉన్న హెవెన్ పార్క్ బిల్డింగ్ పై నుంచి దూకి ఫిబ్రవరి 8న పూజా ఆత్మహత్యకు పాల్పడింది. వనవాడి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూజా చవాన్ కేసులో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ పేరు తెరపైకి రావడంతో ఆయనను అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. పూజా చవాన్ చనిపోయిన కొన్ని రోజులకు సోషల్ మీడియాలో ఆమె పేరుతో కొన్ని ఆడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. ఆ ఆడియో క్లిప్స్‌లో పూజా చవాన్‌తో రాథోడ్‌కు సంబంధాలున్నట్లు స్పష్టమైందని బీజేపీ ఆరోపిస్తోంది. శివసేన మంత్రి రాథోడ్ వల్లే పూజా చవాన్ ఆత్మహత్యకు పాల్పడిందని.. మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత సంజయ్ రాథోడ్ (49) పదవికి రాజీనామా చేశారు. సంజయ్ రాథోడ్ ఈ మధ్యాహ్నం తన భార్యతో కలిసి సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం తర్వాత తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి విపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి దురదృష్టకర రీతిలో చనిపోతే, ఆ ఘటనతో లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సీఎంకు రాజీనామా లేఖ అందించానని, నిజానిజాలేంటో దర్యాప్తులో వెల్లడవుతాయని ధీమా వ్యక్తం చేశారు. తాను మంత్రిగానే తప్పుకున్నానని, ఎమ్మెల్యేగా కాదని రాథోడ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. పూచా చవాన్ తల్లిదండ్రులు మాత్రం తమకు ఎవరి పైనా అనుమానాలు లేవని చెప్పారు. పూజా చవాన్ తండ్రి లహు చవాన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం అప్పుల్లో ఉందని.. ఆ బాకీల గురించి తమ కుమార్తె బాధపడుతుండేదని చెప్పారు. ఆత్మహత్యకు తమ కుటుంబ పరిస్థితులే దారి తీసి ఉండొచ్చని అన్నారు.