మోదీ సర్కారుపై శివసేన బాణాలు
Shiv Sena arrows at Modi government. కరోనా పరిస్థితులను అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని శివసేన చెబుతూ వస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 9 May 2021 2:46 PM ISTభారతప్రధాని నరేంద్ర మోదీ తీరును శివసేన పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా కరోనా పరిస్థితులను అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని శివసేన చెబుతూ వస్తోంది. తాజాగా తమ సామ్నా పత్రిక ద్వారా శివసేన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది.
భారతదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తూ ఉండడంపై ఎన్నో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని శివసేన తెలిపింది. యూనిసెఫ్ పిలుపు మేరకు భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక వంటి చిన్న దేశాలు కూడా మనకు సాయం చేస్తున్నాయని అన్నారు. నెహ్రూ, గాంధీల కుటుంబాల వల్లే భారత్ ఇప్పటికీ మనుగడ సాగిస్తోందని చెప్పింది. పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతర దేశాల నుండి సహాయం పొందేవి. కానీ ప్రస్తుత పాలకుల తప్పుడు విధానాల కారణంగా భారత్ ఇతర దేశాల నుండి సహాయం పొందాల్సి వస్తోందని శివసేన తీవ్రంగా విమర్శించింది.
దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్‌కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో రూ.20,000 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్లతో ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును పూర్తి చేయడంపైనే దృష్టి సారించిందని శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో అభివృద్ది పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకే శివసేన ఇచ్చేసింది. నెహ్రు, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల పేర్లను ఆ వ్యాసంలో శివసేన గుర్తు చేసింది. కరోనా నుండి దేశం బయటకు రావడానికి ప్రధాని చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని.. రాజకీయేతర జాతీయత గురించి నరేంద్ర మోదీ ఆలోచించాల్సిన అవసరం ఉందని నిక్కచ్చిగా శివసేన చెప్పుకొచ్చింది.