కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతుండడంతో మహారాష్ట్ర సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీంతో షిర్డీ ఆలయం పూర్తిగా మూసివేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.
మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకీ భారీ సంఖ్యలో పెరుగుతుండడంతో ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ రోజుల్లో రాత్రి వేళ 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం వారాంతంలో అంటే శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ విధించింది. అలాగే రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి రానుంది. ఏప్రిల్ 30 వరకూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.కర్ఫ్యూ నిబంధనల నుంచి నిత్యవసర సేవలను మాత్రం మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే షిర్డీలోనూ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఈరోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేశారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడంతో షిర్డీలో బాబా దర్శనాలను నిలుపుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆలయాన్ని మూసివేసేందుకు ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.బాబా ఆలయంతో పాటు, ప్రసాదాలయం, భక్తి నివాస్‌ను కూడా మూసేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్ సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షిర్డీ సాయి ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
కాగా.. రాష్ట్రంలో నిత్యం 50 వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా కేసులు, మరణాల పరంగా.. మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.