రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు విద్యార్థులు అదృశ్యం
Seven students missing.రెండు వేర్వేరు ఘటనల్లో ఓ కాలేజీ స్టూడెంట్‌తో సహా ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన
By తోట వంశీ కుమార్ Published on 13 Oct 2021 8:44 AM ISTరెండు వేర్వేరు ఘటనల్లో ఓ కాలేజీ స్టూడెంట్‌తో సహా ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. చదువు ఇష్టం లేదని.. ఆడుకోవడం అంటేనే ఇష్టం అని లేఖ రాసి పెట్టి విద్యార్థులు అదృశ్యం అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో పరిక్షిత్, నందన్, కిరణ్ అనే ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరు ఎక్కువగా ఆటలతోనే కాలం గడిపేవారు. చదువును నిర్లక్ష్యం చేస్తుండడంతో చదువుకోవాలని ఇంట్లో తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రమైన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు విద్యార్థుల ఇంటిలో లేఖలు కనిపించాయి. అందులో.. మాకు చదువు అంటే ఇష్టం లేదు. ఆటలంటేనే ప్రేమ. మాపై మీరెంత ఒత్తిడి తీసుకువచ్చినా.. చదువుకోవాలన్న ఆసక్తి లేదు. క్రీడలే తమ కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మంచి పేరు, హోదా, డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి వస్తామని తెలిపారు. తమ కోసం ఆందోళన చెందొద్దని, ఎక్కడా వెతకొద్దని అందులో రాసుకొచ్చారు.
మరొ ఘటనలో అమృత వర్షిణి(21), 12 ఏళ్ల రోయన్ సిద్ధార్థ్, చింతన్, భూమి వీరు క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఈ నలుగురు ఆదివారం కనిపించకుండా పోయారు. పిల్లలు అమృత వర్షిణితో ఎక్కువగా సమయం గడిపేవారని.. ఆ యువతి తమ పిల్లలను తీసుకువెళ్లిందనే అనుమానాలను పిల్లల తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. వీరిలో ఒకరి ఇంట్లో కూడా ఓ లేఖ దొరికింది. అందులో చెప్పులు, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్, వాటర్ బాటిల్, నగదు, క్రీడా వస్తువులను తీసుకెళ్లాలని రాసుంది. ఈ రెండు కేసులను ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.