కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఎంతంటే.. మెడికల్ షాపుల్లో ఎప్పటి నుండి దొరుకుతాయో తెలుసా..?
Serum's Covishield At rs 400 For States, 600 For Private Hospitals. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 ధరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్లను విక్రయిస్తామని తెలిపారు.
By Medi Samrat Published on 21 April 2021 2:30 PM ISTప్రస్తుతం కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని చెబుతూ ఉన్నారు. అందుకే వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కీలక సూచనలను చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్లను కావాలనుకుంటే రాష్ట్రాలే కొనుక్కునేలా చూసుకుంటూ ఉంది. తాజా కొవిషీల్డ్ ధరలను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు వేర్వేరు ధరలను నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం పెంచుతామని, మిగతా సగం సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రుల సరఫరా కోసం వినియోగించుకుంటామని సంస్థ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 ధరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్లను విక్రయిస్తామని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ల ధరలతో పోలిస్తే తక్కువ ధరకే వ్యాక్సిన్ ను అందజేస్తున్నామని చెప్పారు. అమెరికాలో ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.1,500 కన్నా ఎక్కువే ఉందని, రష్యా, చైనా టీకాలు రూ.750కిపైనే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలు లేదా ప్రైవేట్ వ్యవస్థల నుంచి వ్యాక్సిన్లను తీసుకోవాలని.. ఆ తర్వాత నాలుగైదు నెలల్లో మెడికల్ షాపుల్లోనూ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెస్తామన్నారు.
వివిధ దేశాల్లో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల ధరలు చూడగా.. దేశీయంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ధర ఒక్కో డోసుకు రూ.206గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొవిషీల్డ్‌తో పాటు ఈ టీకాను కూడా ఉపయోగిస్తున్నారు.
ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఆధారంగా ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకా బీఎన్‌టీ162బీ2. అమెరికాలో దీని ధర ఒక్కో డోసుకు 19.50 డాలర్లు. ఈ టీకా అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించిన ఐరోపా సమాఖ్యకు దీన్ని ఒక్కో డోసును 14.70 డాలర్లకు అందిస్తున్నారు. ఇజ్రాయెల్ ఏకంగా ఒక్కో డోసుకు 30 డాలర్లు చెల్లిస్తోంది.
మోడెర్నా సంస్థ రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ-1273 టీకాపై అమెరికా ప్రభుత్వం రాయితీ కల్పించింది. అయినప్పటికీ దీని ధర ఒక్కో డోసుకు 25-37 డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుతం దీనిని యూకే, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్‌లో వినియోగిస్తున్నారు. స్పుత్నిక్-వి టీకా వినియోగానికి భారత్‌లో కూడా అనుమతి లభించింది. ఒక్కో డోసుకు పది డాలర్లు లేదా రూ.750గా ఉంది.
జాన్సన్ అండ్ జాన్సన్ ఒకే డోసు టీకా. దీన్ని 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. దీని ధరను కూడా పది డాలర్లు లేదా రూ.750గా నిర్ణయించారు. ఐరోపా సమాఖ్య దీనికి 8.50 డాలర్లు చెల్లిస్తోంది.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం దీన్ని ఒక్కో డోసును రూ.200కు అందిస్తున్నారు.