దేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నాడు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పవన్‌పుత్ర దయతో ప్రతి ఒక్కరి జీవితాలు తెలివితేటలు, విజ్ఞానంతో నిండి ఉండాలి' అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
పలు రాష్ట్రాలలో హనుమాన్ జయంతి వేడుకను కన్నులపండుగగా నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు సోదరభావం, మత సామరస్యాన్ని ప్రదర్శిస్తూ ఊరేగింపుపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ వైపు నుండి హనుమంతుడి ఊరేగింపు వాహనం వస్తూ ఉండగా.. ముస్లింలు ఎదురుచూస్తూ వచ్చారు. వారు ఉన్న వీధికి వాహనం రాగానే దానిపై పూల వర్షం కురిపించారు. భారత దేశంలో మత సామరస్యానికి ఇదొక నిదర్శనం అని పలువురు చెబుతూ వస్తున్నారు.