గేదెల మందను ఢీకొన్న వందేభార‌త్ ఎక్స‌ప్రెస్‌

Semi-High Speed Train Damaged After Hitting Buffalo Herd In Gujarat.వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ప్ర‌మాదానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2022 12:32 PM GMT
గేదెల మందను ఢీకొన్న వందేభార‌త్ ఎక్స‌ప్రెస్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వారం రోజుల క్రితం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ప్ర‌మాదానికి గురైంది. ముంబై సెంట్ర‌ల్ నుంచి గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌కు వెలుతుండ‌గా వ‌త్వా, మ‌ణిన‌గ‌ర్ స్టేష‌న్ల మ‌ధ్య ప‌ట్టాల‌పైకి వ‌చ్చిన గేదెల మంద‌ను ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. దీంతో రైలు ముందు భాగం ధ్వంస‌మైంది. ఊడి చేతికొచ్చింది. వేగంగా ఢీ కొట్టడంతో పెద్దగా కుదుపులకు లోనైంది.

భారీగా శబ్దం చేస్తూ నిలిచిపోయింది. ఉద‌యం 11.15 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్ర‌మాదం నుంచి ప్ర‌యాణీకులు సుర‌క్షితంగా బ‌య‌ప‌డ్డారు. ఎవ్వ‌రికీ ఎటువంటి గాయాలు కాలేదు. నాలుగు గేదెలు చ‌నిపోయాయి.

సెప్టెంబ‌ర్ 30న వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాని గాంధీ న‌గ‌ర్ నుంచి కాలుపూర్ రైల్వే స్టేష‌న్(అహ్మ‌దాబాద్‌) వ‌ర‌కు ప్ర‌యాణించారు. ఈ రైలు గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ నుంచి ముంబైకి మ‌ధ్య రాక‌పోక‌లు సాగిస్తోంది. ఆదివారం మినహాయించి వారంలో ప్రతిరోజూ తెల్లవారు జామున 6:10 నిమిషాలకు ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12:30 గంటలకు గాంధీనగర్‌కు చేరుకుంటుంది.

అదే రోజు మధ్యాహ్నం 2:05 నిమిషాలకు గాంధీనగర్ నుంచి బయలుదేరి రాత్రి 8:35 నిమిషాలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంటుంది. 16 బోగీలు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ సీట్ల సామర్థ్యం 1,128. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ టెక్నాలజీ ఉంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీకొనే ప‌రిస్థితి వ‌స్తే కిలో మీట‌ర్ దూరం ఉండగానే గుర్తించి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అంతేకాకుండా రైలు వేగం ఆటోమేటిక్‌గా ప‌డిపోతుంది.

Next Story