ఫిబ్రవరి 13 నుంచి వ్యాక్సిన్‌ రెండో డోసు

Second dose of Covid vaccine from feb 13. తొలిద‌శ‌లో టీకా వేసుకున్న ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు రెండో డోసును ఈ నెల 13 నుంచి ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2021 5:31 AM GMT
Second dose of  Covid vaccine from feb 13

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ఇప్పుడిప్పుడే ఈ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. మిగ‌తా వాటితో పోలిస్తే భార‌త్‌లో అభివృద్ది చేసిన వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయి. ఇక ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు దేశంలో జ‌న‌వ‌రి 16 నుంచి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అమెరికా, బ్రిట‌న్‌, ర‌ష్యా వంటి దేశాల కంటే వేగంగా టీకాల‌ను అందిస్తోంది భార‌త్‌. తొలిద‌శ‌లో టీకా వేసుకున్న ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు రెండో డోసును ఈ నెల 13 నుంచి ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు.

దేశంలో ఉన్న ఆరోగ్య‌కార్త‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 45శాతం మంది టీకాలు వేసుకొన్న‌ట్లు తెలిపారు. గురువారం మ‌ధ్యాహ్నాం వ‌ర‌కు మొత్తం 45,93,427 మంది క‌రోనా టీకా వేసుకున్నార‌ని.. ‌దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్‌ కేసుల్లో 70 శాతం కేరళ, మహారాష్ట్రల నుంచి నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత వేగంగా 4 మిలియన్ల వ్యాక్సినేషన్‌ మార్క్‌ను మనం చేసుకున్నాము అని అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 97 శాతం మంది వ్యాక్సిన్‌ పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఈ నెల 3వ తేదీ నుంచి టీకా పంపిణీ ప్రారంభించామని, త్వరలోనే అందరికీ అందిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల తర్వాత వృద్ధులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. పలు దేశాలకు భారత్‌ 56 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్‌ను బహుమతిగా ఇచ్చిందని, వాణిజ్యపరంగా మరో కోటి డోసులు సరఫరా చేసిందని విదేశాంగ శాఖ తెలిపింది.

కాగా, వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. దేశంలో మెజారిటీ ప్రజలకు టీకా అందే వరకు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని వివరించింది.


Next Story