పెగాసిస్‌పై విచార‌ణ‌కు టెక్నిక‌ల్ క‌మిటీ

SC to set up technical expert panel to probe Pegasus snooping row.పెగాసిస్ స్పైవేర్ దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2021 7:45 AM GMT
పెగాసిస్‌పై విచార‌ణ‌కు టెక్నిక‌ల్ క‌మిటీ

పెగాసిస్ స్పైవేర్ దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ స్పైవేర్ సాయంతో ప‌లువురు ప్ర‌ముఖుల ఫోన్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు కేంద్రంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విచార‌ణ‌కు నిపుణులతో కూడిన సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈరోజు ఓపెన్ కోర్ట్ విచారణ (సామాన్యులూ విచారణను ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం) సందర్భంగా సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ కు ఈ విషయాన్ని చెప్పారు. వచ్చే వారం కమిటీ ఏర్పాటుపై అధికారిక ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేశారు.

పైగాసిస్‌పై ద‌ర్యాప్తు కోరుతూ.. దాఖ‌లైన పిటిష‌న్ల త‌రుపున వాద‌న‌లు వినిపిస్తున్న న్యాయ‌వాదుల్లో చంద‌ర్ కూడా ఒక‌రు. సాంకేతిక నిపుణుల కమిటీలో భాగమయ్యేందుకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొందరు సభ్యులు ఆసక్తి చూపడం లేదని, అందుకే కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని సీజేఐ తెలిపారు. వ‌చ్చేవారం నాటికి స‌భ్యుల నియామ‌కాన్ని ఖ‌రారు చేస్తామ‌ని తెలిపారు.

ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసిస్‌తో ప్ర‌తిప‌క్ష నేత‌లు, వ్యాపార‌వేత్తలు, జ‌ర్న‌లిస్టుల‌పై నిఘా పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఆరోప‌ణ‌ల‌పై న‌మోదు అయిన ప‌లు పిటిష‌న్ల‌ను సుప్రీం విచారిస్తోంది. సెప్టెంబ‌ర్ 13న సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిపి..మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌ను రిజ‌ర్వు చేసిన సంగ‌తి తెలిసిందే. న్యాయ‌స్థానం ఆదేశిస్తే.. నిపుణుల క‌మిటీతో విచార‌ణ చేయిస్తాం త‌ప్పిస్తే.. ఫోన్ల‌పై నిఘా ఉంచ‌డానికి పెగాస‌స్ కానీ, ఇత‌రత్రా ఏదైనా సాఫ్ట్‌వేర్ కానీ ఉప‌యోగిస్తోందా అని చెప్పే అఫిడ‌విట్ దాఖ‌లుకు కేంద్రం మ‌రోసారి విముఖ‌త వ్య‌క్తం చేసింది.

Next Story