కేంద్రానికి షాక్.. నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే
SC suspends implementation of farm laws until further notice.కేంద్రప్రభుత్వానికి నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు షాకిచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2021 9:44 AM GMTకేంద్రప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఎన్టీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగుతుందని న్యాయస్థానం పేర్కొంది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కమిటీలో హర్ సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్ లు సభ్యులుగా ఉంటారని తెలిపింది.
వ్యవసాయ సంస్కరణలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వాన్ని శిక్షించాలనేది ఈ కమిటీ ఉద్దేశం కాదని పేర్కొంది. కేవలం రైతుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతోనే కమిటీని వేస్తున్నట్టు తెలిపింది. సమస్య పరిష్కారం కావాలని కోరుకునే వారంతా కమిటీని సంప్రదించవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో కమిటీ ముందుకు వచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని వారి తరపు న్యాయవాది ఎంఎల్ శర్మ ధర్మాసనానికి విన్నవించగా.. ఇలాంటి మాటలను వినేందుకు తాము సిద్ధంగా లేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కావాలని కోరుకునే వారు కమిటీ ముందుకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం కావాలంటే.. అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు.
కమిటీలోని సభ్యులు వీరే..
హర్ సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్ లు సభ్యులుగా ఉంటారని కోర్టు తెలిపింది. అశోక్ గులాటి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌కు గతంలో చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రమోద్ జోషి జాతీయ వ్యవసాయ అకాడమీ సంచాలకులుగా పనిచేశారు. అయితే.. ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని అభిప్రాయపడింది.
ఇక.. జనవరి 26న రైతులు ప్రతిపాదించిన ట్రాక్టర్ ర్యాలీని నిషేధించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు చేసుకున్న దరఖాస్తుపై అన్ని వ్యవసాయ సంఘాలకు నోటీసులు అందించాలని కోర్టు నిర్ణయించింది.