పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్దూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో సుప్రీం కోర్టు నవజ్యోత్‌సింగ్ సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 27,1988న పాటియాలో పార్కింగ్ విషయంపై నవజ్యోత్‌సింగ్ సిద్దూకి గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి కి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిద్దూ.. గుర్నామ్ తలపై కొట్టాడని, ఆస్పత్రికి తరలించే లోపే అతడు మరణించాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు కాగా.. ఈ కేసులో సిద్దూను నిర్ధోషిగా పేర్కొంటూ పంబాబ్-హరియాణా హైకోర్టు 2018మే లో తీర్పు నిచ్చింది. రూ.1000 జరిమానా విధించింది. దీన్ని హత్య కేసుగా పరిగణించలేమని పేర్కొంది.
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ.. గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులు 2018 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం నవజ్యోత్‌సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే.. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది.