ఓ వ్యక్తి అతిగా మద్యం తాగి మరణిస్తే.. ఆ వ్యక్తి వారసులకు బీమా పరిహారం ఇవ్వాలా వద్దా అన్నదానిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. వారికి బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఇచ్చిన తీర్పును సమర్ధించింది. సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న వ్యక్తి 1997లో మరణించాడు.
అతడు అప్పట్లో అతిగా కురిసిన భారీ వర్షాలు, చలి కారణంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో.. అతడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. అధికంగా మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని వచ్చింది. అతడు ప్రమాదంలో చనిపోలేదు కాబట్టి బీమా పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ ఫోరంను ఆశ్రయించింది. అక్కడ బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండు సంస్థలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది.