కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే.. సుప్రీం కోర్టు
SC orders center to give EX Gratia to families of corona death victims.
By తోట వంశీ కుమార్
కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది. ఎంత పరిహారం ఇవ్వాలనేది కేంద్రప్రభుత్వానికే వదిలివేసింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. విధి నిర్వహణలో ఎన్డీఎంఏ విఫలమైందని, కనీస ప్రమాణాలనూ పాటించలేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టాన్ని తాము పరిశీలించామని, దానిప్రకారం 'కచ్చితం' అనేది తప్పనిసరి అని ఉందని పేర్కొంది. కానీ, అలాంటి మార్గదర్శకాలను ఎన్డీఎంఏ పాటించినట్టు ఎలాంటి రికార్డూ లేదని పేర్కొంది. పరిహారం, ఉపశమనం/సాయం వంటి వాటిని నిర్ణయించడంలో సంస్థ కనీస ప్రమాణాలను పాటించాలని సూచించింది.
అలాగే.. కరోనా మృతుల మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వెంటనే జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ధ్రువీకరణ పత్రాల్లో మరణించిన తేదీ, కారణం ఉండాలని పేర్కొంది.