ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆందోళ‌న‌.. ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోంది

SC calls Delhi's air pollution an emergency situation.ఢిల్లీని కాలుష్యం క‌మ్మేసింది. వారం రోజులుగా కాలుష్యం అంత‌కంత‌కూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2021 8:29 AM GMT
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆందోళ‌న‌.. ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోంది

ఢిల్లీని కాలుష్యం క‌మ్మేసింది. వారం రోజులుగా కాలుష్యం అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. బ‌య‌టికి వెళ్లి ఊపిరి తీసుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై శ‌నివారం సుప్రీం కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. గాలిలో నాణ్య‌త క్షీణించ‌డంతో ప్ర‌జ‌లు ఇంట్లో కూడా మాస్కులు ధ‌రించాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్య‌నించింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖ‌పైన పిటిష‌న్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

దేశ రాజ‌ధానిలో పరిస్థితి దారుణంగా ఉందని.. కనీసం ఇంట్లో కూడా మాస్క్‌ పెట్టుకోకుండా ఉండలేకపోతున్నామని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అన్నారు. కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు, వాయు నాణ్యతను పెంచేందుకు ఎలాంటి ఎమర్జెన్సీ చర్యలు చేపడుతున్నారో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీలో రెండు రోజుల లాక్ డౌన్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ఢిల్లీ స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన‌ పంజాబ్, హ‌రియాణా, యూపీ రాష్ట్రాల్లో ఏటా పంట చేతికొచ్చిన త‌రువాత రైతులు.. మిగిలిన పంట వ్య‌ర్థాల‌ను పొలాల్లోనే ద‌హ‌నం చేస్తున్నార‌ని.. ఫ‌లితంగా ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంద‌ని.. పంట వ్య‌ర్థాల‌ను త‌గ‌ల‌బెట్ట‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేంద్రం కోర్టుకు వెల్ల‌డించింది. పంజాబ్‌లో రైతులు పంట వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేయ‌డంతో గ‌త వారం రోజులుగా ఢిల్లీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైంద‌ని.. దీన్ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేయాల‌ని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాద‌న‌లు వినిపించారు.

దీనిపై సీజేఐ రమణ అసహనం వ్యక్తం చేశారు. కాలుష్యానికి కేవలం రైతులనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారన‌న్నారు. కాలుష్యానికి అది కూడా ఒక కారణమే తప్ప.. మొత్తం కాలుష్యానికి అది కారణం కాదు కదా? అని ప్రశ్నించారు. కాలుష్యానికి కారణమవుతున్న మిగతా అంశాల సంగతేంటి? అని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఏదైనా కానివ్వండి.. కాలుష్య నియంత్ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు ఏంటో తెలియజేయాల‌న్నారు.

Next Story