అతి తక్కవ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు.. నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం

SBI Mega E-Auction. తాకట్టులో ఉన్న పలు ఆస్తులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శుక్రవారం మెగా ఈ-వేలం వేయనుంది.

By Medi Samrat  Published on  5 March 2021 6:24 AM GMT
SBI Mega E-Auction

తాకట్టులో ఉన్న పలు ఆస్తులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శుక్రవారం మెగా ఈ-వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్‌ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని, ఆసక్తి గలవారు వేలం పాటలు పాల్గొనవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఈ వేలంలో అన్ని రకాల ఆస్తులను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇందులో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి అన్ని రకాల ఆస్తులను విక్రయిస్తున్నట్లు ఎస్బీఐ తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేసింది. ఎవరైనా ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలను పలు ప్రసార సాధనాలు, సోషల్‌ మీడియాల్లో ప్రసారం చేసింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఇక తాకట్టులో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆయా శాఖల్లో సంబంధిత అధికారుల వివరాలను కూడా ఇచ్చింది.

వేలంలో పాల్గొనాలంటే ఏం చేయాలి

ఈ వేలం బిడ్‌లో పాల్గొనేవారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్‌ డిపాజిట్‌ ఆఫ్‌ మనీని సమర్పించాల్సి ఉంటుంది. సదరు బిడర్‌ సంబంధిత శాఖలో కేవైసీ పత్రాలను సమర్పించాలి. బిడ్‌లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్దగానీ, మరెవరైనా గుర్తింపు పొందిన ఏజన్సీ నుంచి కానీ డిజిటల్‌ సిగ్నేచర్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈఎండీ, కేవైసీ పత్రాలు సమర్పించాక బిడ్‌లో పాల్గొనేవారికి లాగిన్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ను ఎస్బీఐ పంపిస్తుంది. తమ వద్ద తాకట్టులో ఉన్న ఆస్తుల వేలంలో ఎవరైనా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.

తక్కవ ధరకే సొంతం చేసుకోండి

అయితే మార్కెట్‌ విలువ కన్న తక్కువ మొత్తంలో ఇళ్లు, స్థలం, వాహనాలను, ఇతరాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశమని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంకు వేలం వేయనున్న వాటిలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ తో పాటు ల్యాండ్, మిషనరీ, వెయికిల్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ వేలం విషయంలో తాము అత్యంత పారదర్శకంగా ఉంటామని బ్యాంకు తెలిపింది. వేలం వేసే ప్రాపర్టీస్ కు సంబంధించిన కోర్టు ఉత్తర్వులతో కావాల్సిన పత్రాలు, వివరాలు అందిస్తామని తెలిపింది.




Next Story