చిన్నమ్మ ఆశలు అడియాశలు..!
Sasikala's release from jail will be as per court orders I చిన్నమ్మ ఆశలు అడియాశలు..!
By సుభాష్
జైలునుంచి బయటకు ఎప్పుడెప్పుడు వద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న శశికళ ఆశలు అడియాశలయ్యాయి. గడువు కంటే ముందుగా జైలు నుంచి విడుదల చేసే అవకాశమే లేదని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ స్పష్టం చేశారు. దీంతో ఆమె అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన కోర్టు.. 2017 ఫిబ్రవరి 15 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ సైతం అదే జైలులో ఉన్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నాలుగేళ్ల శిక్ష కాలం ముగుస్తుంది.
అయితే సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కుచట్టం కింద పంపిన లేఖకు 2021 జనవరిలో శశికళ విడుదల అవుతారని జైలు సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. రూ.10 కోట్ల జరిమానా కూడా కోర్టుకు ఇటీవలే ఆమె న్యాయవాది చెల్లించారు. కర్ణాటక ప్రభుత్వం విధి విధానాలను అనుసరించి శశికళకు మొత్తం 129 రోజులసెలవులుగా విడుదల చేయాలని శశికళ తరపున న్యాయవాది ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బెంగళూరులోని విధాన సౌధలో శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైన వారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని, ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ముందుగా విడుదలయ్యే అవకాశాలు తక్కువ అని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్ష కాలం ఉంటుందని, ఇందులో రాజీయ ప్రమేయానికి ఏమాత్రం చోటు ఉండదని అన్నారు.
కాగా, చిన్నమ్మ ముందస్తుగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని హోం మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో పిటిషన్ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.