జైలు నుంచి చిన్నమ్మ విడుదల
Sasikala Released from Jail.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2021 5:57 AM GMTతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. అక్రమ ఆస్తుల కేసులో కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు విధించింది. శిక్షాకాలం పూర్తి కావడంతో ఆమె బుధవారం విడుదలైంది. అయితే.. ఆమె గత కొద్ది రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతుండడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అంతేకాకుండా.. ఆమె ఊపిరితిత్తులు దెబ్బతినడంతో.. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఆస్పత్రిలోనే అధికారులు పూర్తి చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10కోట్ల జరిమానాను ఇంతకు ముందే చెల్లించారు.
ఆరోగ్యం బాగానే ఉంది..
ఇదిలా ఉంటే..శశికళ ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు బులెటిన్‌ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని.. ఆమె పల్స్ రేటు నిమిషానికి 76గా, బీపీ 166/86గా ఉందని.. మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. ఆమెను అధికారులు విడుదల చేసిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె బంధువులు భావిస్తున్నారు. మరోవైపు.. ఇంటి వద్దే చికిత్స అందిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.
భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ
శశికళ విడుదల నేపథ్యంలో.. ఆమె తరపు న్యాయవాది రాజరాజన్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. శశికళకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరారు. జైలు నుంచి విడుదలయ్యాక శశికళ చెన్నైలోని తన సోదరుడి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో ఉంటారని, ఆమెకు భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు.
ఇక చిన్నమ్మ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో, అన్నాడీఎంకేలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిన్నమ్మ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసేందుకు నాలుగేళ్ల వరకు అనర్హులు. దీంతో చిన్నమ్మ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూనే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం.