మరికొద్ది నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆసక్తికర పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల కిందటే జైలు నుంచి విడుదలైన శశికళ మళ్లీ ఏఐఏడీఎంకే పార్టీపై కన్నేసింది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వంలకు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.66 కోట్ల అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత గతనెల 27న శశికళ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేలోపే అవినీతి కేసులో జైలు కెళ్లారు. దీంతో పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయాయి. అనంతరం పళని, పన్నీరు సెల్వం కలిసి అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి శశికళను ప్రధాన కార్యదర్శి నుంచి తొలగించడమే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించారు. 2017లోనే పార్టీ పదవి నుంచి తప్పిస్తున్నట్లు పళని, పన్నీరు తీసుకొచ్చిన తీర్మానంపై శశికళ కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు మరోసారి తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించడంతోపాటు పిటిషన్‌ను వెంటనే వినాలని కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును మార్చి 15న కోర్టు విచారించనుంది.