సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
దేశ 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 5:11 AM GMTదేశ 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ హాల్‌లో సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వస్థలం ఢిల్లీ. ఆయన తన విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే చేశారు. ఆయన 1960 మే 14న జన్మించారు. ఆయన తండ్రి జస్టిస్ దేశ్ రాజ్ ఖన్నా.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. మొదట్లో ఢిల్లీలోని తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టులలో, తరువాత ఢిల్లీ హైకోర్టులో, రాజ్యాంగ చట్టం, ప్రత్యక్ష పన్నులు, మధ్యవర్తిత్వం వంటి విభిన్న రంగాలలో ట్రిబ్యునల్స్‌లో ప్రాక్టీస్ చేశారు. కమర్షియల్ లా, కంపెనీ లా, ల్యాండ్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా మరియు మెడికల్ నెగ్లిజెన్స్ లాస్ పై ఆయనకు అద్భుతమైన కమాండ్ ఉంది.
జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన 17 జూన్ 2023 నుండి 25 డిసెంబర్ 2023 వరకు సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని నిర్వహించారు.
ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, భోపాల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కూడా. సంజీవ్ ఖన్నా మే 13, 2025 వరకు సీజేఐగా కొనసాగుతారు