కిలో రూ.29 బియ్యం.. భారత్ రైస్ ఎక్కడెక్కడ దొరకుతాయంటే..
ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 11:14 AM GMTకిలో రూ.29 బియ్యం.. భారత్ రైస్ ఎక్కడెక్కడ దొరకుతాయంటే..
ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. దాంతో.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. తద్వారా బియ్యం ధరలను అదుపు చేసేందుకు ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. భారత్ రైస్ పేరుతో కిలో రూ.29 చొప్పున బియ్యం అమ్మకాలను చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. ఈ విక్రయాలు వచ్చే వారం నుంచే ప్రారంభం అవ్వనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఊరట నివ్వనుంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినా కూడా 15 శాతం మేర ధరలు పెరిగాయని సంజీవ్ చోప్రా చెప్పారు. నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని ఆయన తెలిపారు. అంతేకాక ఈ-కామర్స్ వేదికగా కూడా భారత్ రైస్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఈ రైస్‌ను 5 కేజీలు, 10 కేజీల బ్యాగులుగా భారత్ రైస్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్‌లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని సంజీవ్ చోప్రా చెప్పారు.
మరోవైపు బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారన్న వార్తలపై కూడా సంజీవ్ చోప్రా క్లారిటీ ఇచ్చారు. ధరలు అదుపులోకి వచ్చే వరకూ ఈ నిషేధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోము అని చెప్పారు. అలాగే.. రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టార్ వివరాలను మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సంజీవ్ చోప్రా చెప్పారు.