మోదీపై ప్రియాంక పోటీ చేస్తే పక్కా గెలుస్తారు: సంజయ్ రౌత్

ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Aug 2023 2:15 PM IST
Sanjay Raut,  priyanka gandhi, PM Modi, election,

 మోదీపై ప్రియాంక పోటీచేస్తే పక్కా గెలుస్తారు: సంజయ్ రౌత్

ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నట్లు చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె వారణాసి నుంచి మోదీకీ పోటీగా బరిలోకి దిగితే తప్పకుండా విజయం ఆమెను వరిస్తుందని కామెంట్స్ చేశారు. రాయబరేలీ, వారణాసి, అమేథిలో బీజేపీకి గట్టిపోటీ ఉంటుందని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

కాగా.. ఎన్నికల్లో ప్రియాంకగాంధీ పోటీపై ఇటీవల ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించిన విషయం తెలిసిందే. ఆమె పార్లమెంట్‌లో అడుగు పెడుతుందని భావిస్తానని రాబర్ట్‌ వాద్రా అన్నారు. అందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రియాంకగాంధీ విషయంలో కాంగ్రెస్ తగిన ప్రణాళిక రచిస్తుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు రాబర్ట్ వాద్రా.

ఇక మరోవైపు శివసేన నేత సంజయ్‌ రౌత్‌.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ భేటీపై కూడా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరిఫ్‌తో మన దేశ ప్రధాని మోదీ సమావేశం అయినప్పుడు.. శరద్‌ పవార్, అజిత్‌ పవార్ ఎందుకు భేటీ కాకూడదంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమని ఇండియా సమావేశానికి హాజరుకావాలని చెప్పడానికే అజిత్‌ పవార్‌ను శరద్‌ పవార్‌ కలిసి ఉంటారని సంజయ్‌ రౌత్‌ భావన వ్యక్తం చేశారు. ఇక దీనిపై త్వరలోనే శరద్‌ పవార్‌ మాట్లాడుతారని తెలిపారు. మహారాష్ట్రలో ఏదైనా జరగొచ్చని ఈ సందర్భంగా చెప్పారు సంజయ్‌ రౌత్. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్‌ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌ సహా మహారాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై సంతోషంగా లేరని చెప్పారు. దాంతో.. సంజయ్‌ రౌత్‌ ఒకేసారి రెండు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతున్నాయి.

Next Story