స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై మేలో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా వెల్లడించింది.
By అంజి Published on 17 Oct 2023 12:18 PM ISTస్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై మేలో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా వెల్లడించింది. లైఫ్ పార్టనర్‌ని ఎంచుకోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో అంతర్గత విషయం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో స్వలింగ సంపర్కుల హక్కులను నిర్దేశించేందుకు ఒక కమిటీ వేయాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ జంటలు, లింగమార్పిడి వ్యక్తులు మరియు LGBTQ+ కార్యకర్తలు దాఖలు చేసిన 20 పిటిషన్ల బ్యాచ్‌పై ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ మే 11న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 18న విచారణ ప్రారంభమైంది. తాజాగా తీర్పు వెలువరించింది.
హోమోసెక్సువాలిటీ అనేది కేవలం నగర ప్రాంతాలకే పరిమితమైనది కాదని.. కేవలం ఉన్నతవర్గాలకే చెందినదిగా మాత్రమే పరిమితం చేయలేమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇది ఒక కులానికో, మతానికో, సామాజిక ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదని.. ప్రత్యేక వివాహ చట్టం ఈ దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక వివాహ చట్టంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకికాదని తెలిపారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని, అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌ల కమ్యూనిటీ సమాజంలో వివక్ష తగ్గుతుంది. ఇష్టమైన వ్యక్తితో స్వేచ్ఛగా జీవించడానికి వీలవుతుంది. పిల్లలను అడాప్ట్ చేసుకోవచ్చు. అత్యవసర వైద్య సమయంలో వైద్య చికిత్సకు సమ్మతి పత్రంపై పార్టనర్ సంతకం చెల్లుబాటు అవుతుంది. పెన్షన్, బీమా, గ్రాట్యుటీ, మెడికల్ క్లైమ్స్ లాంటి వాటిలో లీగల్ హెయిర్‌గా భాగస్వామిని పెట్టుకోవచ్చు.