బండరాయిని ఢీకొని పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ దగ్గర రైలు పెను ప్రమాదం తప్పింది.

By Srikanth Gundamalla
Published on : 17 Aug 2024 8:20 AM IST

Sabarmati Express, hit,  rock,  derailed, uttar pradesh

బండరాయిని ఢీకొని పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ దగ్గర రైలు పెను ప్రమాదం తప్పింది. వారణాసి నుండి సబర్మతికి వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే.. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు కాన్పూర్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే భీమ్‌సేన్ సమీపంలో పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెప్పారు. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో సహా అత్యవసర బృందాలు సంఘటనాస్థలానికి వెళ్లాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదనీ.. ప్రయాణికులు సురక్షితంగా ట్రైన్‌ నుంచి దించామని అధికారులు ప్రకటించారు. కాన్పూర్‌కు ప్రయాణీకులను చేరవేసేందుకు భారతీయ రైల్వే బస్సులను అక్కడికి పంపింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ 19168 ఒక బండరాయిని ఢీకొనడంతో పట్టాలు తప్పిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భారతీయ రైల్వే ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.


ఈ సంఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. "సబర్మతి ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 02:35 గంటలకు కాన్పూర్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఢీకొట్టి పట్టాలు తప్పింది. పదునైన హిట్ మార్కులు గుర్తించాం. ఆధారాలు రక్షించబడ్డాయి. IB, UP పోలీసులు కూడా దానిపై పని చేస్తున్నారు." అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే, ఈ మార్గం పూర్తిగా బ్లాక్ చేయబడింది. కాన్పూర్ నుండి ముంబై వైపు ప్రయాణించే రైళ్లకు ఇది కీలక మార్గం కావడంతో గమనార్హం.



Next Story