శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ అంశం.. మళ్లీ తెరపైకి..

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 67...

By -  అంజి
Published on : 16 Feb 2026 11:09 AM IST

Sabarimala Review Petitions SC, Pinarayi Vijayan Government Stand, Womens Entry in Sabarimala, Chief Justice Surya Kant Bench, Kerala Politics and Sabarimala

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ అంశం.. మళ్లీ తెరపైకి..

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 67 రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారణకు స్వీకరించనుంది. ఈ పరిణామం కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని మళ్లీ రాజకీయ ఇరకాటంలోకి నెట్టింది. 2019లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని పట్టుబట్టిన విజయన్ ప్రభుత్వం, మహిళా ప్రవేశానికి రక్షణ కల్పించింది. 'నవోత్థానం' పేరుతో లక్షలాది మంది మహిళలతో 'మహిళా గోడ' నిర్మించింది. అయితే, దీనివల్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది.

ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను పరిశీలించనుంది. ప్రధానంగా మత స్వేచ్ఛ , సమానత్వ హక్కుల మధ్య సమతుల్యత, విశ్వాసాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు? అనే వాటిని పరిశీలించనుంది. గతంలో ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల ధర్మాసనం రద్దు కావడంతో, కొత్త బెంచ్‌ ఏర్పాటుపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. శబరిమలతో పాటు ముస్లిం, పార్శీ మతాల్లోని మహిళల మతపరమైన హక్కులపై కూడా ఈ బెంచ్ చర్చించనుంది.

ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. మరోవైపు, నాయర్ సర్వీస్ సొసైటీ (NSS) సెక్రటరీ సుకుమారన్ నాయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈసారి తన తప్పును సరిదిద్దుకుంటుందని (వైఖరి మార్చుకుంటుందని) ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పి. రాజీవ్ స్పందిస్తూ.. సరైన సమయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తుందని, ప్రజలను రెచ్చగొట్టొద్దని ప్రతిపక్షాలకు సూచించారు.

Next Story