కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు
Rs 35000 Cr allocated for COVID-19 vaccination expenditure in FY22.యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్. కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2021 12:46 PM IST
యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్. అందరి కళ్లు బడ్జెట్ పైనే. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెలో పెద్ద పీట వేశారు. ముఖ్యగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్ ప్రక్రియకు రూ.35వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎప్పుడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ను తయారు చేయడం జరిగిందని చెప్పారు. లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే మన దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదన్నారు. అన్ని రంగాల సిబ్బంది కరోనా సంక్షోభ సమయంలో అద్భుతంగా పని చేశారని కితాబునిచ్చారు. ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనికి పీఎం ఆత్మ నిర్భర్ భారత్ ఆరోగ్య పథకంగా పేరు పెట్టారు. కరోనాపై పోరులో భాగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రూ.35 వేల కోట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6కోట్ల జనాభాకు డోసుకు రూ.255చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఒకవేళ డోసుల ధర పెరిగితే.. బడ్జెట్‌ను మరింత పెంచెందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని.. భారతీయులకేగాక మరో 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని చెప్పారు. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.