మహిళలకు రూ. 2,000, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్.. డీఎంకే హామీల వరద

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అధికార డీఎంకే (DMK) తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటపెట్టింది.

By -  అంజి
Published on : 30 March 2026 8:31 AM IST

DMK Election Manifesto 2026, MK Stalin Welfare Schemes, Illatharasi Coupon Scheme, Tamil Nadu Assembly Elections, Women Monthly Assistance hike, Free Laptops for Students, TN Health Insurance expansion

మహిళలకు రూ. 2,000, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అధికార డీఎంకే (DMK) తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటపెట్టింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, దీనిని ఒక "సూపర్‌స్టార్" గా అభివర్ణించారు. సంక్షేమం, ఆర్థిక వృద్ధిని మేళవిస్తూ మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, వృద్ధులే లక్ష్యంగా భారీ హామీలను గుప్పించారు. కుటుంబ మహిళా పెద్దలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 1,000 సాయాన్ని రూ. 2,000 కు పెంచుతామని ప్రకటించారు. దీనివల్ల దాదాపు 1.37 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని మహిళా గృహిణుల కోసం రూ. 8,000 విలువైన వన్-టైమ్ కూపన్ పథకాన్ని ప్రకటించారు.

ఈ కూపన్ ద్వారా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు వంటి గృహోపకరణాలను స్థానిక షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. అలాగే, ఉన్నత విద్యనభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచుతూ, అర్హత పరిమితిని రూ. 5 లక్షల వార్షిక ఆదాయానికి పెంచారు. వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను రెట్టింపు చేస్తామని వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 120 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా, రూ. 18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ నివారణకు మరిన్ని 'నియో టైడల్ పార్కులను' ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, వృద్ధాప్య పింఛన్ రూ. 2,000 కు పెంపు వంటి అంశాలతో డీఎంకే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తమ అభివృద్ధి నిరంతరాయంగా సాగాలంటే డీఎంకేకే పట్టం కట్టాలని స్టాలిన్ ప్రజలను కోరారు.

Next Story