బాణా సంచా కాల్చడంపై ఆంక్షలు.. కేవలం రెండు గంటలు మాత్రమే
Restrictions for bursting crackers in TN on Deepavali.దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి.
By తోట వంశీ కుమార్
దేశ ప్రజలు అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. చీకట్లను తొలగిస్తూ జీవితంలో వెలుగులు నింపే ఈ పండుగ రోజున ఇళ్లంతా దీపాలతో అలంకరిస్తారు. చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకు క్రాకర్స్, బాణాసంచా కాల్చుతూ సందడి చేస్తారు. అయితే.. బాణా సంచా కాల్చడం ద్వారా వచ్చే పొగతో కాలుష్యం అధికం అవుతుందని పర్యావరణ వేత్తలు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ప్రభుత్వాలు సైతం క్రాకర్స్ కాల్చడం పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం క్రాకర్స్ కాల్చడం, విక్రయించడంపై నిషేదాన్ని విధించగా.. ఇప్పుడు తమిళనాడు సర్కార్ సైతం పలు ఆంక్షలు విధించింది. దీపావళి రోజున కేవలం 2 గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పండుగ రోజున ఏఏ సమయాల్లో బాణా సంచా కాల్చుకోవచ్చు అనే వివరాలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఈ నెల 24న దీవాళి పండుగ జరుపుకోనుండగా.. ఉదయం 6 నుంచి 7 వరకు ఒక గంట, రాత్రి 7 నుంచి 8 వరకు మరో గంట మాత్రమే టపాకాయలు కాల్పాలని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు అవగాహన కల్పించాలని సూచించింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. భారీ శబ్ధాలు, పొగలు వచ్చే బాణా సంచాను కాల్చవద్దని, పర్యావరణ హితమైన (గ్రీన్) టపాసులను మాత్రమే కాల్చుకోవాలని సూచించింది.