'ప్లాస్మా థెరపీ' తొలగింపు
Removal of plasma therapy from covid-19 protocol. కరోనా రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది
By తోట వంశీ కుమార్ Published on 18 May 2021 11:37 AM IST
ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది. ప్లాస్మా థెరపీ వల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో కొవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యారోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ లు సంయుక్తంగా ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇకపై కరోనా చికిత్సలో వినియోగించే ప్లాస్మా థెరపీ నిలిచిపోనుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్ డెసివిర్, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.
ప్లాస్మా థెరపీ అంటే..
కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే (వారి రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు) దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు.
అయితే.. ఒక వేరియంట్ వైరస్ సోకిన బాధితులకు మరో వేరియంట్ కరోనా సోకిన బాధితుల ప్లాస్మా ఇవ్వడంతో కొత్త మ్యుటేషన్లు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నా.. విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స చేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం పలువురు శాస్త్రజ్ఞులు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు.. బ్రిటన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో కూడా ప్లాస్మా చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదని తేలింది. గత ఏడాది మనదేశంలో 400 మంది రోగులపై ఐసీఎంఆర్-ప్లాసిడ్ ట్రయల్స్ నిర్వహించగా ఇదే తేలింది.