మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కరోనా వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా ఇస్తున్నప్పటికి ప్రైవేటు ఆస్పత్రిలో మాత్రం ఒక్కో డోసుకు రూ.250 ధరగా నిర్ణయించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,05,503 మందికి టీకాలు వేశారు. ఇదిలా ఉంటే.. పెట్రో కెమికల్స్ నుంచి టెలికం వరకూ పలు రంగాల్లో విస్తరించిన రిలయన్స్.. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి పిల్లలు, తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది.
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు ఉచితంగా టీకాను అందివ్వనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. అందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతూ ఓ ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపారు. తమ ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషం తమకెంతో ముఖ్యమన్నారు. మొత్తం 19 లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ వ్యాక్సిన్ ఖర్చు మొత్తాన్ని రిలయన్స్ సంస్థ భరిస్తుండటం విశేషం.
దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్‌లో ఒకే రోజు 1.3 మిలియన్లకుపైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం చెప్పింది. డ్రైవ్‌లో భాగంగా 48వ రోజు 13.88లక్షల మందికి, ఇప్పటి వరకు మొత్తం 1,80,05,503 మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. ఇందులో 68.38 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60.22 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ మొదటి మోతాదును పొందగా.. 30.82లక్షల మంది హెల్త్‌కేర్ వర్కర్స్, 54,177 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో మోతాదు ఇచ్చినట్లు వివరించింది.