ఆ విషయంలో జాగ్రత్త అవసరం.. ఆర్బీఐ అలర్ట్..!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రజలకు పలు సూచనలు చేసింది.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 2:35 AM GMT
RBI, alert,  kyc update, cyber crime,

ఆ విషయంలో జాగ్రత్త అవసరం.. ఆర్బీఐ అలర్ట్..!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రజలకు పలు సూచనలు చేసింది. కేవైసీ అప్‌డేట్‌ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. లేదంటే మోసగాళ్ల బారిన పడి లాస్‌ అవ్వడం పక్కా అంటున్నారు. తెలియని సంస్థలు, వ్యక్తులతో అస్సలు వివరాలను పంచుకోవద్దని చెబుతున్నారు ఆర్బీఐ అధికారులు.

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ఈ మధ్య కాలంలో తరచూ మోసాలు జరుగుతున్నాయి. తద్వారా ప్రజలు తమ డబ్బును పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలను నివరించడానికి.. అలాగే డబ్బులను సేఫ్‌గా ఉంచుకోవడానికి కేవైసీ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఇలాంటి మోసాలపై గతంలో కూడా ఆర్బీఐ పలుమార్లు హెచ్చరించింది. కానీ.. మోసాలు ఎప్పటిలానే రిపీట్‌ అవుతుండటంతో మరోసారి సూచనలు చేసింది.

కేవైసీ పత్రాలు.. లేదంటే వాటి కాపీలను తెలియని, గుర్తింపు లేని వ్యక్తులు, సంస్థలతో పంచుకోవద్దని ఆర్బీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే అకౌంట్‌ లాగిన్ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌, కార్డు సమాచారం, పిన్‌, పాస్‌వర్డ్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచిచింది. సాధారణంగా మోసాలు ఫోన్‌కాల్స్, SMS, ఈ-మెయిల్స్‌ ద్వారా జరుగుతున్నాయనీ తెలిపింది. ఇలా మేసేజ్‌లు, కాల్స్‌ వస్తే అస్సలు పట్టించుకోవద్దని చెప్పింది. వ్యక్తిగత సమాచారం, అకౌంట్‌ లాగిన్ వివరాలు బహిర్గతం చేయొద్దని ఆర్బీఐ సూచిచింది. ఇక కొన్ని సందర్భాల్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి లింక్స్‌ వస్తాయనీ.. యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలంటూ కోరతారని ఇలాంటి వాటితో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ పేర్కొంది.

ఇక కేవైసీ అప్‌డేట్‌ కోసం అభ్యర్థన వచ్చినప్పుడు నిర్ధారణ కోసం నేరుగా బ్యాంకు, లేదా సంబంధిత సంస్థను సంప్రదించడం ఉత్తమం అని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు, ఫైనాన్స్‌ సంస్థల కస్టమర్‌ కేర్ నెంబర్‌ను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే పొందాలని ఆర్బీఐ తెలిపింది. ఒక వేళ సైబర్‌ మోసానికి ప్రజలు గురయితే వెంటనే బ్యాంకు, ఫైనాన్స్‌ సంస్థలకు తెలపాలని చెప్పింది. ఆ తర్వాత సైబర్ పోలీసులను ఆశ్రయించాలని ఆర్బీఐ సూచించింది.

Next Story