అలర్ట్.. రుణమాఫీ ఆఫర్ల ప్రకటనలను నమ్మొదన్న RBI
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలను అలర్ట్ చేసింది.
By Srikanth Gundamalla
అలర్ట్.. రుణమాఫీ ఆఫర్ల ప్రకటనలను నమ్మొదన్న RBI
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలను అలర్ట్ చేసింది. కొందరు రుణమాఫీ ఆఫర్లంటూ న్యూస్ పేపర్స్, సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇస్తుంటారని చెప్పింది. ఈ మేరకు ఈ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆర్బీఐ.. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రరచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులు మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రకటనలు తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటిని నమ్మొద్దంటూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.
రుణమాఫీ ఆఫర్ల పేరుతో కొందరు వార్తా పత్రికలు, సోషల్ మీడియాల్లో జోరుగా ప్రచారం చేయిస్తున్నారని చెప్పింది ఆర్బీఐ. సర్వీస్ లేదా చట్టపరమైన రుసుము పేరుతో నగదు వసూళ్లు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నాయనీ.. ఇందుకు ఆయా సంస్థలకు ఎలాంటి అనుమతి లేదని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రచారం చేస్తున్నాయని ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ప్రకటనలు బ్యాంకు రుణ వసూలు ప్రక్రియను బలహీన పరుస్తుందని తెలిపింది. చాలా మంది లోన్లు కట్టడం లేదని ఆర్బీఐ పేర్కొంది. అలాగే డిపాజిటర్లపైనా ఆ ప్రభావం పడుతుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు చేసింది.
కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా రుణమాఫీ ప్రకటనలు చేస్తున్నాయి. అది బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. రుణమాఫీ ప్రకటనలతో రుణాలు తీసుకున్నవారు నెలవారీ వాయిదాలను చెల్లించడం మానేస్తున్నారు. దీంతో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ గుట్టల్లా పేరుకుపోతోంది. రుణ మాఫీలు ప్రకటిస్తుండడంతో లోన్ చెల్లించే వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది ఆర్‌బీఐ.