ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు.
By అంజి Published on 10 Oct 2024 6:24 AM IST
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. అనారోగ్యంతో నిన్న ముంబైలోని బ్రీచ్ ఆస్పత్రిలో చేరిన ఆయన కాసేపటికే కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్ అధికారికంగా ధ్రువీకరించింది.
అనారోగ్యంతో మరణించిన వ్యాపారవేత్త రతన్ టాటా పార్థీవదేహాన్ని ఆస్పత్రి నుంచి కొలాబాలోని నివాసానికి తరలించారు. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆస్పత్రిలోని టాటా భౌతికకాయాన్ని సందర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం షిండే ప్రకటించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనకు దక్షిణ ముంబైలోని ఎన్‌సీపీఏలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచనున్నట్టు చెప్పారు.
రతన్ నావల్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. నాయనమ్మ నవజ్‌బాయ్ పెంపకంలో ఆయన పెరిగారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. 1961లో టాటా స్టీల్‌లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1991 - 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్‌గా ఉన్నారు. తన నాయకత్వంలో టాటా గ్రూప్‌లో అనేక సంస్కరణలు చేపట్టారు.
అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకుని చైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా టాటా గ్రూప్‌ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌తో పాటు కోరస్ స్టీల్‌ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనై సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.
రతన్ టాటా తన జీవితకాలంలో స్వదేశంతో పాటు విదేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. పద్మ భూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.
విలువలతో కూడిన వ్యాపారమంటే ముందుగా గుర్తొచ్చేది రతన్ టాటానే. గ్రూపులో నష్టాల్లో ఉన్న కంపెనీని వదులుకుందామని బోర్డు మెంబర్స్ అంటే ఆయన ఒప్పుకొనే వారే కాదు. దానిపై ఆధారపడి బతికే ఉద్యోగుల జీవితాల గురించే ఆలోచించేవారు. ఆ కంపెనీని కాకుండా మొత్తం గ్రూప్‌ను ఒక యూనిట్‌గా తీసుకునేవారు. సైరన్ మిస్త్రీ టాటా సన్స్ బాధ్యతలు చేపట్టాక మెటల్ కంపెనీలను అమ్మేద్దామంటే అస్సలు ఒప్పుకోలేదు రతన్ టాటా.
రతన్ టాటా అస్తమించినట్టు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. తనకు మెంటార్, గైడ్‌తో పాటు మంచి స్నేహితుడన్నారు. పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేశారన్నారు.
రతన్ టాటా విజనరీ వ్యాపారవేత్త అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టాటా మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఆయన దేశంలోనే పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వం అందించారన్నారు. ఆయన గొప్ప మానవతా మూర్తి అని, వైద్య, విద్య, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ కోసం కృషి చేశారని చెప్పారు. దేశం ఒక ఐకాన్‌ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.