వందేభారత్ తరహాలో హైస్పీడ్ 'ర్యాపిడ్‌ఎక్స్' రైళ్లు..ప్రత్యేకతలు ఇవే..
రైలు ప్రయాణం మరింత సులువు చేసేందుకు హైస్పీడ్ 'ర్యాపిడ్‌ఎక్స్' రైలుని ప్రారంభించనుంది ఇండియన్ రైల్వేస్.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 7:06 PM ISTవందేభారత్ తరహాలో హైస్పీడ్ 'ర్యాపిడ్‌ఎక్స్' రైళ్లు..ప్రత్యేకతలు ఇవే..
హైస్పీడ్ వేగంతో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా వందేభారత్ రైళ్లను కేంద్రం తీసుకొచ్చింది. అయితే.. రైలు ప్రయాణం మరింత సులువు చేసేందుకు హైస్పీడ్ 'ర్యాపిడ్‌ఎక్స్' రైలుని ప్రారంభించనుంది ఇండియన్ రైల్వేస్. ప్రయాణికుల మెరుగైన సేవలందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలు సేవలు ఢిల్లీ-ఘజియాబాద్ మధ్య ప్రారంభమవుతాయి. అక్టోబర్ 20న ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
ఢిల్లీ- ఘజియాబాద్- మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) ప్రాజెక్టులో భాగంగా సాహిబాబాద్, దుహై డిపో మధ్య 17 కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో దేశంలోనే తొలి ర్యాపిడ్‌ఎక్స్ రైలుకు మోదీ పచ్చజెండా ఊపుతారు. శుక్రవారమే ఈ రైలు ప్రారంభం అయినా.. అక్టోబర్ 21 నుంచి ప్రయాణికులకు ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. RRTS కారిడార్ 17 కి.మీ సాహిబాబాద్ నుంచి దుహై డిపో మార్గంలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దర్, దుహై, దుహై డిపో స్టేషన్ల మీదుగా ఈ రైలు నడవనుంది. ఏసీని ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ర్యాపిడ్ఎక్స్ రైల్‌లో అధునుతాన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి రైలులో 2×2 లేఅవుట్‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్ వ్యవస్థ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, డైనమిక్ రూట్ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
కాగా..ఈ రైలు సర్వీసులు ఉదయం 6 గంటలకు ప్రారంభం అయ్యి.. రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున ఉంటాయి. ఆరు కోచ్‌లు ఉంటాయి. ఏకకాలంలో 1700 మంది కూర్చొని.. అలాగే నిలబడి ప్రయాణం చేయవచ్చు. . ఇక, టిక్కెట్ ధరల విషయానికి వస్తే.. స్టాండర్డ్ కోచ్‌లలో కనీస టికెట్ రూ.20.. గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో కనీస టికెట్ ధర రూ.40.. గరిష్ఠ ధర రూ.100గా ఉంటుంది. ర్యాపిడ్‌ఎక్స్ రైలులో ఒక కోచ్‌ను మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లతో కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్‌రెస్ట్‌లు వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలులో తొలి కోచ్, ఢిల్లీ నుంచి మీరట్ వెళ్లే రైలులో ఆఖరి కోచ్ ప్రీమియం బోగీలు.