హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన.. 12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన సంబంధాలు

Rajnath Singh briefs Parliament over CDS Gen Bipin Rawat's chopper crash.సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 14 మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 6:36 AM GMT
హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన.. 12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన సంబంధాలు

సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్న భార‌త వాయుసేన‌కు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నీల‌గిరి జిల్లా కూనూర్ వద్ద కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 13 మంది దుర్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి లోక్‌స‌భ సంతాపం తెలిపింది. స‌భ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం ఈ దుర్ఘ‌ట‌న‌పై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటన చేశారు.

హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో 13 మంది మృతి చెందార‌న్నారు. ఈ ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ప్ర‌స్తుతం లైఫ్ స‌పోర్ట్‌పై ఉన్నార‌ని.. ఆయ‌న్ను ర‌క్షించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్ దంప‌తులు మృతి చెందార‌ని రాజ్‌నాథ్ వెల్ల‌డించారు. ఇక‌ బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో హెలికాప్టర్ ల్యాండ్‌ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.

హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని.. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లార‌న్నారు. అప్ప‌టికే మంట‌ల్లో కాలిపోతున్న హెలికాఫ్ట‌ర్‌ను వారు చూశార‌ని.. ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు స్థానికులు శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి పార్థివ‌దేహాల‌ను గురువారం సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఈ ప్ర‌మాదంపై ఎయిర్‌మార్షల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇప్ప‌టికే విచార‌ణ క‌మిటీ త‌మ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టింద‌న్నారు.

Next Story