మరో రైలు ప్రమాదానికి కుట్ర.. ఈసారి ట్రాక్‌పై సిమెంట్ దిమ్మె
ఇండియన్ రైల్వేలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 10:40 AM ISTఇండియన్ రైల్వేలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలే ప్రయాణికులు ఈ ప్రమాదాలతో ఆందోళన చెందుతుంటే.. కొందరు దుండగులు ప్రమాదాలు జరగాలని కుట్రలు చేస్తున్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైలు పట్టాలపై సిలిండర్‌ను పెట్టారు. రైలును పట్టాలు తప్పించేందుకు యత్నించారు. ఈ సంఘటన మరువకముందే మరోటి వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో కూడా కొందరు దుండగులు రైలు ప్రమాదం సృష్టించేందుకు కుట్రపన్నారు. ఈ సారి అజ్మీర్ వద్ద రైలు ప్రమాదం జరగాలని ట్రాక్‌పై బరువైన సిమెంట్ దిమ్మెను పెట్టారు.
అయితే.. ఇదే ట్రాక్‌పై వచ్చిన ఒక రైలు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. రైలు ఇంజిన్‌తో పాటు కొంత భాగం ట్రాక్ ఈ ప్రమాదంలో దెబ్బ తిన్నది. ఆర్పీఎఫ్ అధికారులకు లోకో పైలట్ సమాచారం అందించాడు. రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంట్ దిమ్మె విరిగిన భాగాలను ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రెండ్రోజుల క్రితమే కాన్పూర్‌లో ఇలాంటి కుట్ర మరవకముందే మరోటి జరగడం కలకలం రేపుతోంది.
ఆదివారం కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శివరాజ్‌పూర్ దగ్గర పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్‌ను పెట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను అతి వేగంగా ఢీ కొట్టింది. సిలిండర్ పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీని గురించి సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని గ్యాస్ సిలిండర్‌తో పాటు పెట్రోల్ బాటిల్‌ను, అగ్గిపెట్టను స్వాధీనం చేసుకున్నారు. రైలును పట్టాలు తప్పించాలనే కుట్రతోనే ఈ పని చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ మేరకు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.