వందేభారత్‌ రైల్లోకి వర్షపు నీరు.. లీకేజీతో ఇక్కట్లు...

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుడిసెలో కురిసిట్లు వందేభారత్‌ రైల్లో వర్షపు నీరు లీకైంది.

By Srikanth Gundamalla  Published on  15 Jun 2023 7:51 PM IST
Vande Bharat Express, Rain Water Leak, Viral Video, Railway

వందేభారత్‌ రైల్లోకి వర్షపు నీరు.. లీకేజీతో ఇక్కట్లు...

కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా.. అధునాతన సదుపాయాలను కల్పించారు. అయితే.. వందేభారత్‌ రైళ్ల సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి నిత్యం ఈ రైళ్లు ప్రమాదాలకు గురై దెబ్బతింటూనే ఉన్నాయి. కొన్నిసార్లు దుండగులు రాళ్లు విసిరితే.. ఇంకొన్నిసార్లు చెట్ల కొమ్మలు పడి అద్దాలు ధ్వంసమయ్యాయి. జంతువులను ఢీకొట్టి ముందు భాగం ధ్వంసమైన ఘటనలూ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా కేరళలో మరో సంఘటన జరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ రైలుని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం సెంట్రల్‌ స్టేషన్లో పచ్చజెండా ఊపి రైల్‌ని ప్రారంభించారు. తిరువనంతపురం, కాసర్‌గోడ్‌ మధ్య రాకపోకలు సాగిస్తోంది ఈ రైలు. తాజాగా ఈ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో డొల్లతనం బయటపడింది. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుడిసెలో కురిసిట్లు వందేభారత్‌ రైల్లో వర్షపు నీరు లీకైంది. వర్షపు నీరు లోపలికి రావడంతో ప్రయాణికులంతా షాక్‌ అయ్యారు. అక్కడే ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వర్షపు నీటిని పట్టుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. టబ్స్‌ను పెట్టి నీళ్లు రైల్లో మొత్తం వ్యాపించకుండా చూశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై స్పందించి ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నారు. వందేభారత్‌లో వెళ్లే వారికి గొడుగులు ఇవ్వాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ పెడుతన్నారు.

ఈ ఘటనపై దక్షిణ రైల్వే స్పందించింది. ఇలాంటి ఘటనకు జరిగినట్లు తమకు సమాచారం రాలేదని తెలిపింది.

Next Story