సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట..రెండేళ్ల జైలు శిక్షపై స్టే
పురువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 9:53 AM GMTసుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట..రెండేళ్ల జైలు శిక్షపై స్టే
పురువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌గాంధీకి ఈ మధ్యకాలంలోనే శిక్ష పడింది. ఇదే కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రం కోర్టు. పరువు నష్టం కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు రాహుల్‌గాంధీకి విధించిన శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణం చెప్పలేదని పేర్కొంది. ఈ క్రమంలో దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపేయాలని చెప్పింది. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంలో సందేహమే లేదని తెలిపింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఇది అందరూ ఆశిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాహుల్ గాంధీ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతోకూడిన ధర్మాసనం విచారించింది. రాహుల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ ’ కాదని, ఆయన ఇంటి పేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ నేరస్తుడు కాదని.. బీజేపీ కార్యకర్తలు గతంలోనూ కేసులు వేశారని అన్నారు. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు.
కర్ణాటకలో జరిగిన ఎన్నికల సమయంలో నిర్వహించిన ఓ సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో.. రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. గుజరాత్ కోర్టు రాహుల్ పిటిషన్ను కొట్టివేయగా.. సుప్రీకోర్టులో శిక్ష తీర్పును సవాల్ చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ధర్మాసనం రెండేళ్ల శిక్షపై స్టే విధించింది.