తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ బుధవారం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో సమావేశమయ్యారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ డికె శివకుమార్ డిప్యూటీ సిఎం పదవికి సిద్ధంగా లేరని, ఈ విషయం పరిష్కారం అయ్యే వరకు ఢిల్లీలోనే ఉండబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీఎం ఎవరు అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఇంకా ఫైనల్ కాలేదని చెబుతున్నారు. నిర్ణయం బయటకు రావడానికి ఇంకా 48 గంటల సమయం పట్టొచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సూర్జేవాలా ప్రకటించారు. చర్చలు ఇంకా జరుగుతున్నాయని.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయం తామే అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని.. మే 18వ తేదీన బెంగళూరులో సీఎల్పీ భేటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. కంఠీవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అనే వార్తలు కూడా వచ్చాయి. సిద్ధరామయ్య మద్దతు దారులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని బాణాసంచా కూడా కాల్చారు. ఇప్పుడు ఇంకా కొత్త సీఎం ఎవరో ఫిక్స్ అవ్వలేదనే వార్త ఉత్కంఠను రేపుతోంది.