జోడో యాత్రలో ఉద్రిక్తత.. రాహుల్‌పై కేసు పెట్టాలన్న అస్సాం సీఎం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 2:15 PM IST
rahul gandhi, jodo nyay yatra, assam cm,

జోడో యాత్రలో ఉద్రిక్తత.. రాహుల్‌పై కేసు పెట్టాలన్న అస్సాం సీఎం

అస్సాం పోలీసులు రాహుల్‌గాంధీ జోడో యాత్రను అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గౌహతి నగరంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు బారికేడ్లను పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకువచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మంగళవారం నాగాలాండ్, అస్సాం సరిహద్దుల వద్ద స్థానిక యువతతో రాహుల్‌గాంధీ మాట్లాడారు. అక్కడి నుంచి గౌహతి నగరానికి బయల్దేరారు. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ తమ యాత్ర మార్గాన్ని అంతకుముందు అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా గౌహతిలో యాత్రను అనుమతించబోము అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో భాగంగా నగరంలోకి రాకుండా నగర బైపాస్‌ మీదుగా వెళ్లాలని చెప్పారు. కానీ.. కాంగ్రెస్‌ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. కార్యకర్తలు పెద్ద ఎత్తున గౌహతికి చేరుకున్నారు. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ సమయంలో రాహుల్‌గాంధీ అక్కడే ఉన్నారు.

ఇక ఈ ఉద్రిక్తల గురించి మాట్లాడిన రాహుల్‌గాంధీ.. ఇదే మార్గంలో బజ్‌రంగ్‌ దళ్‌ యాత్ర చేపట్టిందని గుర్తు చేశారు. అంతేకాదు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ర్యాలీ చేశారని అన్నారు. అప్పుడు రాని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాహుల్‌గాంధీ. అయితే.. తమను అడ్డుకునేందుకు పెట్టిన బారికేడ్లను దాటామని.. కానీ చట్టాన్ని అతిక్రమించలేదని చెప్పారు.

ఇక ఇదే అంశంపై ఎక్స్‌ వేదికగా స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడారని అన్నారు. ఇందుకు గాను రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం డీజీపీని ఆదేశించారు. కాగా.. అస్సాం సీఎం ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story