మణిపూర్‌లో రాహుల్‌గాంధీని అందుకే అడ్డుకున్నామన్న పోలీసులు

రాహుల్‌ గాంధీకి రక్షణ కల్పించేందుకే ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 9:00 PM IST
Rahul Gandhi, Convoy, Stopped, Manipur, Police, Explanation

మణిపూర్‌లో రాహుల్‌గాంధీని అందుకే అడ్డుకున్నామన్న పోలీసులు

మణిపూర్‌లో కొంతకాలం నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మణిపూర్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ రాహుల్‌కు చుక్కెదురైంది. మణిపూర్‌ వద్ద రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్‌లో సహాయ శిబిరాలను సందర్శించేందుకు వెళ్తుండగా అడ్డగించారు. దీంతో.. కాంగ్రెస్‌ నాయకులు పోలీసుల తీరుని తప్పుబట్టారు. ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో.. మణిపూర్‌ పోలీసులు వివరణ ఇచ్చారు. రాహుల్‌గాంధీని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరించి చెప్పారు.

హింసాత్మక ఘటనల్లో భాగంగా రాహుల్‌ గాంధీకి రక్షణ కల్పించేందుకే ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్‌ వెళ్లాల్సిన హైవేపైనే నిరసనకారులు టైర్లు తగులబెట్టారని.. కాన్వాయ్‌పై రాళ్లు రువ్వే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందుకే ముందు జాగ్రత్తలో భాగంగానే కాన్వాయ్‌ని బిష్ణుపూర్‌లో ఆపాలని రాహుల్‌గాంధీని అభ్యర్థించినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు.. రాహుల్‌గాంధీ వెళ్లాలనుకునే మార్గంలో గ్రనేడ్‌ దాడి జరిగే ప్రమాదం ఉందన్నారు. అందుకే హెలికాప్టర్‌లో వెళ్లాలని సూచించామని చెప్పారు. ఇక పోలీసుల సూచనతో ఆ తర్వాత హెలికాప్టర్‌లో వెళ్లి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడారు.

అయితే.. అంతకుముందు రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకోవడంపై మణిపూర్ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చారని.. సీఎం ఆదేశాల మేరకే రాహుల్‌ని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. బాధితులతో మాట్లాడకుండా రాహుల్‌గాంధీ పర్యటనను రాజకీయం చేయాలని చూశారని మణిపూర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. మణిపూర్ జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Next Story