ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలి నుంచి బరిలో రాహుల్‌గాంధీ
అమేథి, రాయ్‌బరేలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు బరిలో దిగుతారనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 3:50 AM GMTఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలి నుంచి బరిలో రాహుల్‌గాంధీ
ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు బరిలో దిగుతారనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. తాజాగా ఈ రెండు స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది కాంగ్రెస్. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటలు. రాయ్‌బరేలి స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. అలాగే అమేథీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు అయిన కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దించుతోంది.
ఈ రెండు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకి గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ క్రమంలోనే చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ. ఇవాళే రాహుల్‌గాంధీతో పాటు, కిశోరీలాల్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ రెండు స్థానాల నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఎట్టకేలకు ఏఐసీసీ ప్రకటనతో ఆ వార్తలకు చెక్‌పడింది. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఈసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దాంతో.. రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ పేరును ఏఐసీసీ నిర్ణయించింది. కాగా.. ఇవాళ రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో తన అధికారిక కార్యక్రమాలను అన్నింటిని సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాయ్‌బరేలి చేరుకోనున్నారు.
మరోవైపు రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఇప్పుడు రాయ్‌బరేలి కూడా కన్ఫామ్ కావడంతో రెండు లోక్‌సభ స్థానాల నుంచి రాహుల్ పోటీ చేస్తున్నట్లు అయ్యింది. రాయ్‌బరేలిలో రాహుల్‌గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ తరఫున దినేశ్ ప్రతాప్ సింగ్ పేరును అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్సీ అయిన దినేశ్ ప్రతాప్‌సింగ్ దేశ ప్రజలకు పెద్దగా తెలియదు కానీ.. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు మాత్రం బాగానే తెలుసు. ఆయన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి మాత్రం తన గెలుపుని ఎవరూ ఆపలేరని దినేశ్ ప్రతాప్ సింగ్ అంటున్నారు.
'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए श्री @RahulGandhi को उत्तर प्रदेश के रायबरेली से और श्री किशोरी लाल शर्मा को अमेठी से कांग्रेस उम्मीदवार घोषित किया गया है। pic.twitter.com/AyFIxI62XH
— Congress (@INCIndia) May 3, 2024