రామమందిర కార్యక్రమాన్ని 'మోదీ ఫంక్షన్'గా చేశారు: రాహుల్‌గాంధీ
అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతుంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 3:39 PM ISTరామమందిర కార్యక్రమాన్ని 'మోదీ ఫంక్షన్'గా చేశారు: రాహుల్‌గాంధీ
అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతుంది. ఇందుకు అనుగుణంగా ఆలయ ట్రస్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానాలు అందించారు. అయితే.. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర కార్యక్రమాన్ని మోదీ ఫంక్షన్‌గా అభివర్ణించారు. జనవరి 22వ తేదీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా నరేంద్ర మోదీ కార్యక్రమంగా మార్చాయంటూ విమర్శలు చేశారు. అందుకే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు నిరాకరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాము అన్ని మతాలు, అచారాలను గౌరవిస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. అయితే.. జనవరి 22న రామమందిర వేడుకలకు వెళ్లడంపై హిందూ మతపెద్దలు, హిందూ మతానికి చెందిన వ్యక్తులు కూడా ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ వారు ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శింఆచరు. ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ రూపొందించిన ఈ రాజకీయ కార్యక్రమానికి వెళ్లడం తమకు ఇష్టం లేదని చెప్పారు రాహుల్‌గాంధీ.
కాగా.. అంతకుముందు రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి ఆహ్వానాలు అందించింది రామాలయ ట్రస్టు. అయితే.. తాము ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జనవరి 22న జరగబోయే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతున్నారు. దేశవ్యాప్తంగా 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.