రాహుల్ గాంధీ రాక.. ఇండియా కూటమికి మరింత బలం తేనుందా?

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానంలో రాహుల్ పాల్గొనే వీలు కలుగుతుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 7 Aug 2023 2:07 PM IST

Rahul Gandhi,  Parliament, more strength, INDIA alliance,

రాహుల్ గాంధీ రాక.. ఇండియా కూటమికి మరింత బలం తేనుందా? 

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని సోమవారం పునరుద్ధరించారు. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 8 లేదా 10న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంలో రాహుల్ గాంధీ పాల్గొనేందుకు వీలు కలుగుతుంది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు

గుజరాత్ కోర్టు పరువు నష్టం కేసులో గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో మార్చి 23న గాంధీ లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు పడింది. రెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం శిక్ష విధించిన్నప్పుడు, చట్టసభలకు అనర్హులు అవుతారు. సుప్రీం కోర్టు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్ గాంధీ వాయనాడ్‌కు లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

కాంగ్రెస్‌లో సంబరాలు

సుప్రీం కోర్టు స్టే విధించగా.. కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇక తాజా నోటిఫికేషన్ పట్ల మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే తన ట్వీట్‌లో, “రాహుల్ గాంధీని తిరిగి పార్లమెంటు సభ్యునిగా నియమించాలనే నిర్ణయం స్వాగతించదగిన చర్య. ఇది భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా వాయనాడ్‌కు ఉపశమనం కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వం తమ పదవీకాలంలో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఉన్నారు. ముందు పరిపాలనపై దృష్టి పెట్టాలి." అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అవిశ్వాస తీర్మానం:

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణ జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ ఇవ్వనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు రాకపోవడంతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే..! దీంతో జూలై 26, 2023న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ మధ్య అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలని వ్యాపార సలహా కమిటీ నిర్ణయించింది.

పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆగస్టు 5న తన ట్వీట్ లో “రాహుల్ గాంధీ మీద అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారని.. దీంతో సుప్రీంకోర్టు స్టే విధించిందని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొనేందుకు ప్రధాని భయపడుతున్నారా?" అంటూ చెప్పుకొచ్చారు.

సిద్ధమవుతున్న 'INDIA' పార్టీలు:

మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని కోరుతూ ఆగస్టు 8న అవిశ్వాస తీర్మానానికి INDIA కూటమి లోని అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. మణిపూర్‌ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందని.. దీంతో బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇక 13 రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతోంది.

ఆచరణలో కొత్త ఉదాహరణ

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చడ్డా మాట్లాడుతూ, “ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత అన్ని ఇతర కార్యకలాపాలు నిలిపివేస్తారని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నాయి. అయితే తొలిసారిగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టి పాస్ చేస్తోంది. ఇది రాజ్యాంగబద్ధంగా పలు సమస్యలకు కారణం అవుతుంది." అని అన్నారు.

అవిశ్వాస తీర్మానంపై ముందుగా చర్చించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు నేతల ద్వారా స్పష్టం చేసింది. మణిపూర్‌పై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8 నుంచి 10 వరకు తీర్మానం చేపట్టేందుకు అంగీకరించింది. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని మాట్లాడేలా చేయడమే ముఖ్య కారణమని అంటున్నారు.

Next Story