ఎర్రకోటపై దాడి కేసు.. పంజాబీ గాయకుడు దీపక్ సిద్దూ అరెస్ట్
Punjabi actor deep Sidhu accused in Red fort violence case arrested.కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ గాయకుడు దీపక్ సిద్దూ అరెస్ట్
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2021 10:23 AM ISTకిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన దీప్ సిద్దూ.. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉండగా ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రెండు నెలలుగా ప్రశాంతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన వ్యక్తి దీప్ సిద్ధూగా విచారణలో తేలింది.
చారిత్రక ఎర్రకోటపై నిత్యం జాతీయ జెండా రెపరెపలాడే చోట సిక్కు మత జెండా ఎగురేయడమే కాదు సెక్యూరిటీ పోర్స్ పై దాడికి పురికొల్పడం వెనుకు ఉన్నది కూడా సిద్ధూనేనని తేలింది. అతడితో పాటు ఎర్ర కోట వద్ద జెండాలు ఎగురవేసిన జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్,గుర్జంత్ సింగ్ ల ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు. ర్యాలీలో అల్లర్లకు కారణమైన 12 మంది ముఖచిత్రాలను ఇటీవల ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఈ 12 మంది కర్రలు పట్టుకుని దాడులు చేసినట్లు వీడియోల్లో కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులపై కూడా దాడులు చేసింది వీరేనని తేలిందన్నారు. కిసాన్ ర్యాలీ అల్లర్లకు సంబంధించి మొత్తం 44 కేసులు నమోదు చేయగా, 122 మందిని అరెస్టు చేశారు.
దీప్ సిద్దూ తరుచూ ఓ మహిళా స్నేహితురాలితో టచ్‌లో ఉండేవాడు. కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమెకు అతను ఎప్పుడూ వీడియోలను పంపేవాడని పోలీసులు విచారణలో తేల్చారు. అయితే దీప్ పంపిన ఫోటోలు, వీడియోలను.. ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ మహిళ అప్‌లోడ్ చేసేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
అసలు సిద్దూ ఎవరు?
పంజాబ్ లోని ముక్తసర్ లోని సిక్కు కుటుంబంలో ఏప్రిల్ 2, 1984లో సిక్కు కుటుంబంలో దీప్ సిద్దు జన్మించాడు. ముక్త్‌సర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాధమిక విద్యను అభ్యసించిన దీప్ సిద్దు.. పటియాలలోని పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా సాధించి.. మోడల్, గాయకుడు, నటుడు, లాయర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 2018లో జోరాదాస్ నంబ్రియా సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అప్పట్నుంచి అటు తెరపైనే కాకుండా.. నిజజీవితంలో కూడా గ్యాంగ్‌స్టర్ మాదిరిగానే సిద్దూ ఉంటున్నాడు.