ఢీకొన్న రెండు రైళ్లు.. బోగీలపైకి ఎక్కేసిన గూడ్స్ ఇంజిన్

పంజాబ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  2 Jun 2024 11:15 AM IST
punjab, train accident, two loco pilots, injured,

ఢీకొన్న రెండు రైళ్లు.. బోగీలపైకి ఎక్కేసిన గూడ్స్ ఇంజిన్

పంజాబ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేఘర్ సాహిబ్ లో రెండు గూడ్స్‌ రైళ్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల లోకో పైలట్లకు గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు లోకోపైలట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు సమాచారం.

తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు ఢీకొన్న తర్వాత ఒక ట్రైన్‌ ఇంజన్ అదుపు తప్పి పక్క ట్రాక్‌పై పడిపోయింది. ఈ క్రమంలోనే పక్క ట్రాక్‌లో వెల్తున్న ప్యాసింజర్‌ రైలుకు తగిలింది. రెండు గూడ్స్‌ రైళ్ల ఇంజిన్ భాగాలు, భోగీలు దెబ్బతిన్నాయి. ఇద్దరు లోకో పైలట్లకు గాయాలు అయ్యాయి. లోకో పైలట్ల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వికాస్‌ కుమార్, హిమాన్షు కుమార్‌గా తెలిపారు. వీరు గాయపడటంతో అంబులెన్స్‌లో పాటియాలలోని రాజేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వికాస్ కుమార్ తలకు బలమైన గాయం అయ్యిందని చెప్పారు.

కాగా.. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలదేన్నారు రైల్వే అధికారులు. గూడ్స్‌ రైళ్ల కోసం నిర్మించిన డీఎఫ్‌సీసీ ట్రాక్‌ న్యూసిర్హింద్‌ స్టేషన్‌ దగ్గర ప్రమాదం జరిగింది. అప్పటికే బొగ్గు లోడుతో కూడిన రెండు ట్రైన్‌లను ఇక్కడ నిలిపి ఉంచారు. అప్పుడే అంబాలా నుంచి జమ్మూతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలుపైకి గూడ్స్‌ రైలు ఇంజిన్ పడిపోయింది. దాంతో భయపడ్డ ప్రయాణికులు కేకలు వేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అంబాలా టు లూథియానా అప్‌లైన్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని రైల్వే అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు.


Next Story